ట్రేడ్ మార్క్ గా గుర్తింపు పొందిన తాజ్ హోటల్

SMTV Desk 2017-06-20 18:15:07  country, mumbai tajtohel, trendmark, Registration,Building,

ముంబై, జూన్ 20 : ముంబై మహానగరానికి చిహ్నంలాంటి తాజ్‌మహల్ ప్యాలెస్ ట్రేడ్‌మార్క్ గుర్తింపు దక్కించుకుంది. ఈ హోటల్ 114 ఏండ్ల నాటి భవనం.. దేశంలోనే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పొందిన మొదటి భవనంగా రికార్డులకెక్కింది. ఇకపై ఎవరుపడితే వారు తాజ్‌మహల్ ప్యాలెస్ చిత్రాలను వ్యాపారం కోసం వినియోగించుకునేందుకు వీలుపడదు. అలా ఉపయోగించాలనుకుంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్‌మార్క్ పొందిన కట్టడాల జాబితాలో ఉన్న న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్, సిడ్నీలోని ఒపెరాహౌస్‌ల సరసన ముంబైలోని తాజ్‌ప్యాలెస్ హోటల్ భవన నిర్మాణం కూడా చేరింది. ఓ నిర్మాణ రూపకల్పనకు ట్రేడ్‌మార్క్ కోసం ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా కంటే ముందుగానే ఈ హోటల్ లో అసలైన భవనాన్ని జెమ్సెడ్జీ టాటా 1903, డిసెంబరు 16న ప్రారంభించారు. అప్పటికే ముంబయిలో ఉన్న ప్రఖ్యాత గ్రాండ్ వాట్సన్ హోటళ్లో తెల్లవారికి తప్ప ఇతరులను రానిచ్చే వారు కాదు. దీంతో టాటా భారతీయలకు అంకితమిస్తూ ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. సీతారాం ఖండేరావు, డి.ఎన్.మీర్జా అనే ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్చర్లు ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ చేయగా, ఆంగ్ల ఇంజినీరు డబ్ల్యు.ఎ.చాంబర్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఖాన్ సాహెబ్ సొరబ్జీ రుట్టోన్జీ అనే కాంట్రాక్టర్ నిర్మించిన అందమైన మెట్లకు రూపకల్పన చేశారు. హోటల్‌పై 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మీడియాలో దీనికి మరింత ప్రచారం దక్కింది.ఇందులో భాగస్వాములైన షాపూర్జి పల్లాన్‌జీ తదితరులు దీన్ని హోటల్‌గా మార్చారు. దేశంలో గుర్తింపు పొందిన తొలి భవనం ఈ తాజ్ మహల్ హోటల్ అవ్వడం గమనార్హం.