పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం: కేంద్రమంత్రి ట్వీట్

SMTV Desk 2018-01-09 13:26:14  media, freedom, ravishankar prasad, tweet

న్యూ డిల్లీ, జనవరి 09: మీడియా రంగంపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్రం స్పందించింది. తాజాగా ఆధార్‌ కార్డుల వివరాలు గోప్యత గురించి వార్త రాసిన విలేకరి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పత్రికా స్వేచ్ఛకు తాము కట్టబడి ఉన్నామని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో భారత అభివృద్ధికి దోహదం చేసే ఆధార్‌ గోప్యత, పవిత్రతను కాపడటం తమ బాధ్యత అని తెలిపారు. పత్రికకు కథనం అందించిన విలేకరి రచనా ఖైరా పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామని.. అయితే, ఎవరినీ నిందితులుగా పేర్కొనలేదని పోలీసులు స్పష్టం చేశారు. విలేకరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ఆధార్‌ వివరాల గోప్యతకు భంగం కలిగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. లోపాలను బయటపెట్టినవారిపై చర్యలకు ఉపక్రమించడమేంటంటూ ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. ఆధార్‌ గోప్యత అతిక్రమణ అంశంపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ కోరింది.