తెలుగు దేశం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన లోకేష్

SMTV Desk 2017-06-20 17:17:03  Vijayawada,AP Minister Nara Lokesh,TDP MLAS

విజ‌య‌వాడ‌, జూన్ 20 : విజయవాడ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి, పార్టీ బలోపేతం, నాయకుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. నారా లోకేష్‌ అధ్యక్షతన కేశినేని భవన్‌లో విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి ఇంఛార్జిగా ఉన్న నారాలోకేష్‌ ఈమేరకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. జూలై,ఆగస్ట్ నెలల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించాలని లోకేష్‌ సూచించారు. పార్టీలో మిగిలిన కమిటీల ఏర్పాటును నాయకులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా త‌మ‌కున్న సమస్యలను విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాల‌ని కోరారు. నిధుల కొరత ఉండటం వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, దీనివ‌ల్ల విజయవాడ కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆలస్యం అవుతోంద‌ని లోకేష్ కు వివరించారు. దీనిపై స్పందించిన‌ లోకేష్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి, అధికారులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్, సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఆలయ కమిటీల ఏర్పాటు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇతర శాఖల మంత్రుల సమన్వయం, సహకారం అవసరమైన వారితో చర్చించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కమ్యూనిటీ వ‌ర్మి కంపోస్ట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని ఆయన సూచించారు.