కరీంనగర్‌లో ఐటీ టవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన

SMTV Desk 2018-01-09 10:56:55  ktr, it tower, karimnagar, inogration

కరీంనగర్, జనవరి 09: హైదరాబాద్‌కు దీటుగా ఐటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌ ఐటీ టవర్‌ పనులకు శంకుస్థాపన చేసిన రోజునే కాసర్ల నాగేందర్‌రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు స్థాపించిన 8 విదేశీ కంపెనీలు ఒప్పందం చేసుకోవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ టవర్‌ను ఏడాదిలో పూర్తిచేసి.. ప్రారంభం రోజే 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ మన ప్రాంతానికి చెందినవారితో మాట్లాడుతామని, మరిన్ని కంపెనీలు తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మనం తయారుకావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఉద్యోగం చేసేవారుగానే ఉండిపోకుండా.. ఉన్నతమైన, కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. యువతకు నాణ్యమైన శిక్షణ కల్పిస్తే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని.. ఇందుకోసం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (టాస్క్‌)ను, టీ–హబ్‌ను కొత్తగా నిర్మించే ఐటీ టవర్‌లో నెలకొల్పుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్, కరీంనగర్‌లను అవకాశాలకు గమ్యంగా మార్చుతామని కేటీఆర్ వెల్లడించారు.