తన తండ్రితో కలిసి కౌన్సెలింగ్‌ కు హాజరైన యాంకర్‌ ప్రదీప్...

SMTV Desk 2018-01-08 16:46:10  Anchor Pradeep attended Counseling, hyderabad

హైదరాబాద్, జనవరి 8 : గతేడాది డిసెంబర్ 31న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ నేడు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి జూబ్లిహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో నేడు మ‌ధ్యాహ్నం తన తండ్రితో కలిసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన శిక్షణా కేంద్రానికి ప్రదీప్‌ హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్‌ పూర్తైన అనంతరం, ప్రదీప్ మాట్లాడుతూ...పోలీసులు నాకు కేటాయించిన తేదీని బట్టే నేడు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నా. పోలీసులు మద్యంతో జరిగే పరిమాణాలను చాలా వివరించారు. తాగడం వల్ల శరీరంలో వచ్చే మార్పులను గురించి తెలిపారు. డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యేందుకు అవకాశాలు.. తదితర అంశాలను చక్కగా తెలిపారని ఆయన వెల్లడించారు. తర్వాత జరిగే కార్యక్రమాలకు కూడా నేను హాజరవుతాను. నేను చేసిన తప్పు మళ్లీ ఇంకెవరూ చేయకూడదని ప్రదీప్ పేర్కొన్నారు. కాగా, తాను షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నందున ఇదివరకు జరిగిన కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయానని తన విజ్ఞప్తిని మన్నించాలంటూ ఆయన పోలీసులను కోరినట్టు చెప్పారు.