రాజు కాని రాజు

SMTV Desk 2017-06-20 16:47:00  Itali,Europe,Mantenigro,Prince,Albebiya

ఇటలీ, జూన్ 20 : గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి రాజు కాకపోయినప్పటికీ ఆ విధంగా జీవించాలని దురాశ పెంచుకున్నాడు. దానికోసం అడ్డదారుల వైపు పయనించాడు. ఓ దేశానికి యువరాజులా నకిలీ ధృవపత్రాలు సృష్టించి, సెలబ్రెటీలు, హాలీవుడ్‌ నటులతో కలిసి పార్టీల్లో పాల్గొంటూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. అనుకోకుండా ఇటీవల మోసం బయటపడి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇటలీకి చెందిన 56 ఏళ్ల వ్యక్తి తన పేరు స్టీఫెన్‌ సెర్నెటిక్‌ అని.. మాంటెనీగ్రో దేశానికి యువరాజుగా తనని తాను సమాజానికి పరిచయం చేసుకుని, యూరప్‌ దేశాలు తిరిగి అక్కడి ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ రాజభోగాలు అనుభవించాడు. రాజవంశస్థుడిగా అందరిని నమ్మించేందుకు నకిలీ ధృవపత్రాలు, రాజముద్రలను సృష్టించాడు. తన పేరుతో ఓ వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని, అందులో 14-18 శతాబ్దాల మధ్య తమ వంశస్థులు అల్బెనియా, సెర్బియా దేశాలను పాలించినట్టుగా దానికి సంబంధించిన వంశవృక్షాన్ని ఉంచాడు. పార్టీల కోసం ప్రత్యేకంగా ‘ప్రిన్సిప్‌ స్టీఫెన్‌’ అని తన పేరు మీదే ఓ వైన్‌ని కూడా తయారు చేయించాడు. అలా యువరాజులా అందరినీ నమ్మిస్తూ సినీనటులు, సెలబ్రెటీలను కలుసుకుని, వారితో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేసేవాడు. ఇలా అన్ని పకడ్బందీ ఆధారాలు సృష్టిస్తూ తనపై ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంత తెలివిగా అందర్నీ మోసం చేసుకుంటూ వచ్చిన స్టీఫన్‌ చిన్న తప్పుతో దొరికిపోయాడు. గత సంవత్సరం ఇటలీలోని బ్రిందిసి పర్యటనకు వెళ్లి అక్కడి ఓ ఖరీదైన హోటల్‌లో వారం రోజులపాటు బస చేశాడు. అయితే బిల్లును చెల్లించకుండా మేస్‌డోనియా ఎంబసీకి పంపించమని సూచించాడట. స్టీఫన్‌ సూచన మేరకు రోమ్‌లోని ఆ దేశ ఎంబసీకి పంపించగా తమ దేశంలో అలాంటి యువరాజు ఎవరూ లేరని అధికారులు చెప్పారట. అంతేకాదు ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. ఏడాది పాటు రహస్య విచారణ జరిపారు. ఇటీవల అతని ఇంట్లో సోదాలు నిర్వహించి మాంటెనిగ్రో యువరాజుగా పేర్కొన్న నకిలీ ధృవపత్రాలు, అవార్డులను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత స్టిఫెన్‌ను అరెస్టు చేసి విచారిస్తునట్లు పోలీసులు తెలిపారు.