నిరంతర విద్యుత్ అత్యుత్తమం: కేసీఆర్‌కు స్వామినాథన్ లేఖ

SMTV Desk 2018-01-07 16:36:35  ms swaminadhan, letter, kcr, 24 power supply

హైదరాబాద్, జనవరి 07: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నది. ఈ నిర్ణయం పై అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు సీఎం కేసీఆర్ ను ప్రశంసి౦చారు. తాజాగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. "రైతులకు 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరాపై చేసిన ప్రకటన తనకు ఎంతగానో సంతోషం కలిగించింది. ప్రత్యేకించి తెలంగాణలో ఎక్కువభాగం మెట్ట ప్రాంతమైనందున ఈ నిర్ణయం రైతులకు గొప్ప వరంలాంటిది. పంటలను కాపాడే సాగునీరు వ్యవసాయ విజయానికి అత్యంత కీలక౦. ఈ నిర్ణయం పట్ల మొత్తం రైతాంగం తరఫున కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలతో, మీ కలలను సాకారం చేసుకునేలా ఈ సంవత్సరం ఉండాలని ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు"అని స్వామినాథన్ తన లేఖలో తెలిపారు.