థ్యాంక్‌ యూ నితీశ్‌ అంటూ తేజస్వి వ్యంగ్య ట్వీట్‌

SMTV Desk 2018-01-07 14:13:55  tejaswi yadav, tweet, jdu, rjd, nitish, bjp

పాట్నా, జనవరి 07: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శిక్ష కాలం ఖరారయ్యాక కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, జేడీయూలు స్వాగతించడం ఆర్జేడీ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. శత్రువులతో చేతులు కలపటమే కాకుండా.. మిత్రుడి(లాలూ)ని దారుణమైన వెన్నుపోటు పొడిచారంటూ బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పై ఆర్జేడీ నేతలు విరుచుకుపడుతున్నారు. లాలూను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ ఓ ప్రణాళికతోనే మహా కూటమిని విచ్ఛిన్నం చేసిందని.. బీజేపీ పన్నిన ఉచ్చులో జేడీయూ పడిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌ తన ట్విట్టర్‌లో ఓ వ్యంగ్య పోస్టును ఉంచారు. థాంక్యూ వెరీ మచ్‌ నితీష్‌ కుమార్‌ అంటూ ఆయన తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్ చేశారు. అంతకు ముందు తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం విదితమే. ఒకవేళ లాలూ బీజేపీతో సంధి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. ‘‘లాలూ బీజేపీ ముందు మోకరిల్లి ఉంటే.. ఆ పార్టీ ఆయన్ని రాజా సత్యహరిశ్చంద్రుడిగా అభివర్ణించి ఉండేదేమో. ఈ విషయంలో జేడీయూ చాలా ముందుంది’’ అని తేజస్వి ఎద్దేవా చేశారు. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపినప్పుడే లాలూ జైలుకు వెళ్లటం ఖాయమైపోయిందని, తేజస్వి పిల్ల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత ఆర్‌పీఎన్‌ సింగ్‌ సూచించగా.. లాలూ అవినీతి రాజకీయాలకు శుభం కార్డు పడిందని జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు.