‘త్రిముఖ వ్యూహాన్ని’ డీఎంకే చేధిస్తుందా..!

SMTV Desk 2018-01-07 13:26:05  dmk, rajni kanth, stalin, tamilanadu politics

చెన్నై, జనవరి 7 : తమిళనాడు అంటే రాజకీయ మార్పులకు చిరునామా.. ఏ రాష్ట్రంలో లేని రాజకీయ పెను మార్పులు ఈ గడ్డ పై చోటు చేసుకుంటాయి. జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరిగింది. తాజాగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి అభిమానాలకు తీపి వార్త అందించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊపుందుకున్నాయి. అధికార పక్షమైన అన్నాడీఎంకే అధికారులు లోపలి భావాలు ఎలా ఉన్నా రజినీ రాకతో మాకేలేంటి సమస్య లేదని ధీమా వ్యక్త౦ చేస్తున్నారు. కాగా ప్రధాన ప్రతి పక్షమైన డీఎంకే పార్టీ మాత్రం సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావడం శరాఘాతం భావిస్తుంది. ఎందుకంటే గత రెండు సార్లు 2012, 2014 లో కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తుంది. ఒక వైపు అధికార పార్టీ, మరో వైపు రెబెల్ గా ఎదుగుతున్న టీటీవీ దినకరన్ తో ఆ పార్టీకి ముప్పు ఉండనే ఉంది. ఇప్పుడు సూపర్ స్టార్ రాకతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అన్నాదురై మరణం తర్వాత డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన కరుణానిధి పార్టీలో కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది నచ్చని ఎంజీఆర్ డీఎంకే పార్టీ నుండి బయటకు వచ్చి 1972 లో అన్నాడీఎంకే పార్టీ స్థాపించారు. ప్రజల్లో తనకున్న అభిమానంతో ముఖ్యమంత్రిగా ఎదిగి తమిళ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. అయితే డీఎంకే పార్టీ అతని పై విమర్శల పర్వం కొనసాగించింది. ఇప్పుడు రజనీ కూడా జన నేతగా ఎక్కడ తమకు పోటీ ఇస్తారని పార్టీ వర్గాల్లో గుబులు చెలరేగుతుంది. మరో మూడు సంవత్సరాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే, దినకరన్, రజనీ ఈ త్రిముఖ వ్యూహాన్ని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఏ మేరకు నివారిస్తుందో చూడాలి.