బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కు ఉద్వాసన

SMTV Desk 2017-06-20 16:04:47  Andhra Pradesh CM Chandrababu,IYR Krishna Rao,Brahmins Corporation

అమరావతి, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావును ఉద్వాసన పలకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఐవైఆర్ అనేక పోస్టులు షేర్ చేయడంపై చంద్రబాబుకు నేతల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. పార్టీ కార్యకర్తలను కూడా కాదని సముచిత స్థానమిచ్చి గౌరవిస్తే ఐవైఆర్ వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేక‌త‌ వ్యక్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గౌరవం కల్పించడంతో పాటు ఆ స్థానానికి ఇంకా పదవి విరమణ చేయకుండానే బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమిస్తే ఈ విధంగా ప్రతిష్ట దిగ‌జార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఐవైఆర్ పై వేటు వేయడం సబబేనని నిర్ణయించారు. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులకు తగు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి... గతంలో ఏ బ‌డ్జెట్‌లోనూ కేటాయించని విధంగా నిధులు కేటాయించామని చంద్రబాబు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. బ్రాహ్మణులకు ఆ నిధులు సద్వినియోగం అయ్యేలా చేస్తారని కృష్ణారావుకు బాధ్యతలు అప్పగిస్తే ఈ విధంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొని రావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఉపేక్షించకుండా కృష్ణారావును పదవి నుంచి తప్పించి పార్టీని న‌మ్ముకున్న వారికి ఆ ప‌ద‌వి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వేమూరి ఆనందసూర్యను బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించడాన్ని, బాహుబలి-2 సినిమాకు టిక్కెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఐవైఆర్‌ కృష్ణారావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ ఫేస్‌బుక్‌ ఖాతాల్లో ఉంచిన విమర్శనాత్మక పోస్టుల్ని ఆయన తన ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో తెదేపా శ్రేణులు ఆయ‌న తీరుపై మండిపడ్డాయి.