పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల హిమపాతాలు...

SMTV Desk 2018-01-07 11:35:30  weather report, america, jammu, newdelhi.

న్యూఢిల్లీ‌, జనవరి 7 : అగ్రరాజ్యాన్ని మంచు తుఫాన్‌ వణికిస్తోంది. ఫ్లోరిడా, న్యూయార్క్‌, ఇంగ్లాండ్‌ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 40డిగ్రీల సెల్సియస్‌ గా నమోదయ్యాయి. ఇలాంటి సమయాలలో ప్రజలు బయటకు వెళ్ళడం కాస్త ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, విమానాశ్రయాలను మూసివేశారు. అంతేకాకుండా హ్యూస్టన్‌ నుంచి బోస్టన్‌ వరకు ఉన్న నగరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంటకు 113 కి.మీ.ల వేగంతో మంచు తుఫాన్‌ గాలులు వీస్తుండడంతో కొన్ని చోట్ల 56 సెంటీమీటర్ల మందంలో మంచు పేరుకుపోతోంది. ఇదిలా ఉండగా ఉత్తరాదిని అతి శీతల గాలులు వణికిస్తున్నాయి. జమ్మూ-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, యూపీ, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలుచోట్ల హిమపాతాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. దట్టమైన మంచు కురుస్తుండటంతో పూర్తిగా 36 రైళ్లను, మరో 30 పాక్షికంగాను రద్దుచేశారు. అంతేకాకుండా 85 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కొనసాగుతోంది. కాగా జమ్మూ-కశ్మీర్‌ లో మంచు తుపాను ధాటికి సమాధి అయిపోయిన వారిలో ఇప్పటికి 11 మృతదేహాలను వెలికితీశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.