తెలంగాణ ప్రభుత్వానికి అవార్డుల పంట

SMTV Desk 2017-06-20 15:29:56  Telangana Government,Jobs, jio, jupally krishnarao, narendarsing thomar,

హైదరాబాద్,జూన్ 20 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చిన తెలంగాణ ప్రభుత్వం జాతీయస్థాయిలో ఐదు అవార్డులను దక్కించుకున్నది. యువతకు ఉపాధి శిక్షణ, అవకాశాలు కల్పించడంలో విశేష కృషి కి గాను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అవార్డును తెలంగాణ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈ.జీ.ఎం.ఎం) కైవసం చేసుకోగా.. నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్వో-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఉత్తమ అవార్డును తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సొంతం చేసుకున్నది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఈ అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాష్ట్ర అధికారులకు అందజేశారు. కోరిన ప్రతి ఒక్కరికీ జాబుకార్డు అందించడం.అంతరించి పోతున్న ఆదిమ తెగలకు, ప్రత్యేక జాబ్‌కార్డులు జారీ చేయడంతోపాటు కూలీలకు వేతన స్లిప్పులను అందజేయడం, ప్రత్యేక గ్రామీణాభివృద్ధిశాఖ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం వంటి కార్యక్రమాలకుగాను జాతీయస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలోను అవార్డును కైవసం చేసుకుంది. ఈ పథకంలో కల్పించిన ఆస్తులకు భువన్ సాఫ్ట్‌వేర్ ద్వారా జియోట్యాగింగ్ చేయడంతో అత్యంత ఎక్కువ ఆస్తులను కంప్యూటరీకరించినందుకు మరో జాతీయస్థాయి అవార్డును తెలంగాణ సొంతం చేసుకుంది. అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం, అత్యధిక సరాసరి వేతన రేటు చెల్లించిన క్యాటగిరీలో జాతీయ ఉత్తమ జిల్లా అవార్డును వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీఆర్‌డీవో అందుకున్నారు. గ్రామంలో ఉన్న కూలీల్లో ఎక్కువ మందికి పనికల్పించి గ్రామస్థాయిలో సుస్థిర ఆస్తులను ఎక్కువ మొత్తంలో కల్పించినందుకు గాను నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ సర్పంచి అవార్డు అందుకున్నారు. కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు చెల్లించినందుకు నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ కూడా అవార్డును అందుకున్నారు. ఉత్తమ నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్వో-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) అవార్డును సెర్ప్ సీఈవో అందుకున్నారు. అవార్డు గ్రహీతలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.