పాడి పరిశ్రమకు ప్రభుత్వ సహాయం

SMTV Desk 2017-06-20 14:35:47  India Independence,Farmer,Pulivendula,Indiragandhi Centre for Advanced Research

కడప, జూన్ 20 : భారత దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి వ్యవసాయాధారిత జీవనాన్ని గడపడమే కాకుండా పాడి పశువులను పోషించడంలో అగ్రస్థానంలో ఉంది. పాడి పశువులపై పరిశోధనలు జరిపి సరికొత్త దేశవాళీ రకాలను సృష్టించడంతో పాటు.. పాలదిగుబడిని పెంచడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. అందులో భాగంగానే రాష్ట్రంలోని రెండు కీలక ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులను ప్రారంభించింది. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని రీతిలో పశు పరిశోధనలకు పులివెందులలో ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ (ఐజీకార్ల్‌) కేంద్రాన్ని రూ.247 కోట్ల వ్యయంతో 656.50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. దీనిలో అధునాతన ప్రయోగశాలలతో పాటు, సెమన్‌ బ్యాంకు, బయో ల్యాబ్స్‌ నిర్మించారు. కొంత కాలానికి పరిశోధనలు జరగకుండానే ఈ కేంద్రం మూలకు చేరింది. ఒకటి రెండు సంస్థల వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాధి నిర్ధారణ కిట్ల తయారీకి లీజు కేంద్రంగా మారింది. ఏడు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఐజీకార్ల్‌ కేంద్రం ప్రస్తుతానికి మళ్లీ ప్రగతి దిశగా అడుగులు వేస్తుంది. పూర్తిస్థాయిలో స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తల ప్రయోగ వేదికగా ఈ కేంద్రాన్ని మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. ఇక్కడ మౌలిక వసతుల మెరుగుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. వాస్తవానికి.. ఏడాది కిందటే ప్రభుత్వం ఐజీకార్ల్‌ పేరును ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)గా మార్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో అసంపూర్తిగా ఉన్న ఏబీఎస్‌ఎల్‌-3, బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల్సిన అవసరాన్ని టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రధానంగా గుర్తించింది. వారు ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఏపీకార్ల్‌లో సంస్కరణల చర్యల ప్రక్రియ ఊపందుకోనుంది. ఏపీకార్ల్‌ మాదిరిగానే నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలోనూ ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. గతంతో పోల్చితే నిర్మాణాలు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతో మూడేళ్ల కిందట ఇక్కడ బీజం పడింది. 2015లో పనులు ఆరంభమయ్యాయి. ఈ కేంద్రం ద్వారా 50 రకాల స్వదేశీ మేలుజాతి పశువులను అభివృద్ధి చేసి.. పాడి రైతులకు అందివ్వాలనేది లక్ష్యం. అధిక పాల ఉత్పత్తి, పిండమార్పిడి ద్వారా సరికొత్త రకాలను సృష్టించి పశుసంపద పెంచాలనేది ఉద్దేశం. దీంతోపాటు పశువులు రోగనిరోధకశక్తిని తట్టుకునేలా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి బాటలు వేశారు. రూ.36 కోట్ల వ్యయంతో 150 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అడుగులుపడ్డాయి. వివిధ కారణాలతో ఇక్కడ అభివృద్ధి నెమ్మదిగా మారింది. ఇప్పటివరకు చిన్నపాటి షెడ్డు మాత్రమే ఉండగా.. ఇప్పుడు షెల్టర్లు, సిబ్బంది నివాస సముదాయాలు ఏర్పాటయ్యాయి. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చింతలదేవి, పులివెందుల.. ఈ రెండింటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.