నగరంలో ఆహార పదార్థాల కల్తీ

SMTV Desk 2017-06-20 13:31:17  Duplicate Foods, Yellowhaldi,coriander, chilli, ginger garl, police

హైదరాబాద్, జూన్ 20 : నగర ప్రజారోగ్యలతో చెలగాటమాడుతూ నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు... వెంకటేశ్వర్లు ఎప్పటిలాగే కిరాణా దుకాణానికి వెళ్లి కావాల్సిన సరుకులన్ని పట్టుకొచ్చారు. రెండు మూడు రోజుల తరువాత ఇంట్లో అందరూ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి వెళితే.. పరీక్షలు జరిపి ఆహారం కల్తీ జరిగిందని తెలిపారు. చివరికి వారు వినియోగించిన కారం, పసుపు కల్తీ అయిందని తేలింది. ఎప్పుడూ వాడే బ్రాండే అయినా ఎందుకు ఇలా.. అంటే పైన కవర్‌ మాత్రమే బ్రాండెడ్‌.. లోపల ఉన్న పదార్థం మాత్రం కల్తీ జరిగిందని వెల్లడైంది. నగరంలో ఇప్పుడు ఇలాంటి పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. హైజెనిక్‌ కండీషన్స్‌ ప్రొడక్ట్‌ అంటూ మార్కెట్‌లోకి తీసుకొస్తూ ఇలాంటి వాటిపై లాభం అధికంగా ఉండడంతో దుకాణ వాసులు అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు వినియోగించిన వారు మాత్రం ఆసుపత్రులపాలవుతున్నారు. ఈ మేరకు నగర పోలిసులు పరిశ్రమలపై రెండు రోజులుగా దాడులు నిర్వహించడంతో భారీ ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్ పరవస్తు మధుకర్‌స్వామి సీజ్‌ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కల్తీ పసుపు, ధనియాలు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న పరిశ్రమపై దాడులు నిర్వహించారు. రూ.10 లక్షలకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి వాడే రసాయనలన్నింటిని ధ్వంసం చేశారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన నిర్వాహకుడు మహ్మద్‌ జావెద్‌ అక్తర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశ్రమలో పనిచేస్తున్న పది మంది కార్మికులను అదుపులోకి తీసుకొని నిర్వాహకుడిపై ఐపీసీ 272, 273, 336, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ తయారీ దారులపై పీడీయాక్ట్ ప్రయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.