జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే మృత్యువాత

SMTV Desk 2017-06-20 11:48:29  North Koriya,America Student Oto vambiyar,Verjeeniya university

చికాగో, జూన్ 20 : ఉత్తరకొరియా జైలు నుంచి ఇటీవల విడుదల అయిన అమెరికా విద్యార్థి ఒటో వాంబియర్‌ మృత్యువాత చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై తీవ్రమైన నరాల గాయాల కారణంగా ఒటో మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒటో వాంబియర్‌.. ఉత్తర కొరియాను సందర్శించిన సందర్భంలో తన హోటల్‌ గోడపై ఉన్న ఒక రాజకీయ బ్యానర్‌ను తొలగించాడు. గతేడాది జనవరిలో ఒటో తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో అతడిని పోలీసులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఒటో చేసిన నేరానికి గానూ.. కఠిన శ్రమతో కూడిన 15ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ఈ చర్యను అప్పట్లో అమెరికా తీవ్రంగా ఖండించింది. అతన్ని విడిపించేందుకు అనేక సార్లు ప్రయత్నాలు చేసింది. అలా దాదాపు 18 నెలల పాటు కఠినమైన శిక్షను అనుభవించిన తర్వాత ఈ నెల 13 న ఒటోను ఉత్తర కొరియా విడుదల చేసింది. చెర నుంచి విముక్తి పొందిన సమయంలో ఒటో తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. ఒటోను నిర్బంధంలోకి తీసుకున్న సమయంలోనే అతడు కోమాలోకి వెళ్లినట్లు ఉత్తర కొరియా చెబుతోంది. అధిక మోతాదులో నిద్రమాత్రలు వేసుకోవడం, విషపూరిత మాదకద్రవ్యాలు తీసుకోవడంతో అతడు అనారోగ్యానికి గురైనట్లు చెప్పింది. గతవారం ఒటోను తన సొంతవూరు ఒహియోలోని సిన్సినాటికి తీసుకొచ్చారు. కనీసం నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఒటోను చూసి అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉత్తర కొరియా అధికారుల హింసాత్మక తీరు వల్లే తన కుమారుడు ఈ స్థితికి చేరాడని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అతడికి ఇంట్లోనే చికిత్స అందించారు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు వెల్లడించారు. కనీసం చివరి రోజుల్లోనైనా ఒటోకు ప్రశాంతత దొరికినందుకు కాస్త ఆనందంగా ఉందని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒటో మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి చెందారు. ఉత్తర కొరియా తీరును తీవ్రంగా ఖండించారు. అదో క్రూరమైన పాలన.. అలాంటి నిరంకుశ వ్యక్తుల చేతుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమని ట్రంప్‌ పేర్కొన్నారు. కనీసం చనిపోయేముందైనా అతన్ని తన తల్లిదండ్రులకు అప్పగించగలిగాం అని ట్రంప్‌ అన్నారు.