నేటి నుంచి ప్రారంభమైన జన్మభూమి - మా ఊరు...

SMTV Desk 2018-01-02 12:05:41  ap cm chandrababu naidu, janmabhumi maa uru, amarvathi

అమరావతి, జనవరి 02 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిని పెంచేలా కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు. జన్మభూమిపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్న సీఎం చంద్రబాబు, అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని హెచ్చరించారు. గ్రామాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములుగా ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకరికొకరు పోటిబడి మంచిని ప్రోత్సహించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రజల భాగస్వామ్యానికే పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం పూర్తిగా నివారించడంతో పాటు సాధికార మిత్రల సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు. సంచార జాతుల్లో అర్హులైన అందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. గ్రామాలు, వార్డులకు టెన్ స్టార్ రేటింగ్ ఇస్తామన్న ఆయన, గ్రామీణ క్రీడల నిర్వహణకు ప్రతి జిల్లాకు 3లక్షల రూపాయలు సప్లిమెంటరీ ఫండ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. పదిరోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 13వేల గ్రామాలు, 3వేల వార్డుల్లో జన్మభూమి సభలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు 175 నోడల్ ఆఫీసర్లను నియమించినందున ప్రతి సమస్యను బాధ్యతతో పరిష్కరించి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.