ఐకమత్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కేసీఆర్‌

SMTV Desk 2017-12-30 18:14:23  cm kcr, telangana government, telangana

హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రజలందరం ఐకమత్యంతో, సంఘటితశక్తితో ముందుకెళితేనే రాష్ట్రాభివృద్ధి బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. నగర శివారు కోకాపేటలో రూ.10 కోట్ల వ్యయంతో తలపెట్టిన గొల్ల, కురుమ సంక్షేమభవనాలకు ఆయన శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం గండిపేట సమీపంలోని సీబీఐటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గొల్ల, కురుమల బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... "ఇక్కడ మొదలైన ప్రస్థానం అద్భుతంగా సాగాలి. ఇక్కడి వెలుగులు చుట్టూ ప్రసరించాలి. గొల్ల, కురుమల్లో అనాథలు, పేద విద్యార్థులకు ఈ సంక్షేమ భవనాలే ఆశ్రమం కావాలి. రాష్ట్రంలో ఈ రెండు సామాజికవర్గాల్లోని అనాథ, పేద యువతుల వివాహాలు ఇక్కడే జరగాలి. ఇంతటి ఉన్నత కార్యక్రమానికి మూలనిధి ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేస్తున్నాం. ఈ రెండు వర్గాలోని సంపన్నులు, ప్రవాసులు మూలనిధికి సహకరించాలి. నేను సీఎం అయ్యాక చూసిన కొన్ని విచిత్ర పరిస్థితులతో గొర్రెల యూనిట్ల పంపిణీ నిర్ణయం తీసుకున్నా. తెలంగాణకు రోజూ 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. వాటిలో 350 లారీలు కేవలం హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్నట్లు గుర్తించాం. రాష్ట్రంలో గొల్ల, కురుమల జనాభా 30 లక్షలు. గంగపుత్రులు, ముదిరాజ్‌లు 40 లక్షలు. ఈ 70 లక్షల మంది చేతులు కలిపితే కోటీ నలభై లక్షల చేతులు అవుతాయి. వీరంతా కలిసి పనిచేస్తే వేల కోట్ల సంపద సృష్టించవచ్చు. ఎవరైనా అడ్డుకుంటే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల దృష్టికి తీసుకెళ్లండి. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లోని పండ్ల తోటల్లోనూ గొర్రెలు మేపుకునేందుకు వీలుగా కలెక్టర్‌లకు ఆదేశాలిచ్చాం. పండ్ల తోటల్లో గొర్రెలు మేయటం వల్ల పంటకు నష్టం వాటిల్లదు. పైగా భూమికి బలం చేకూరుతుంది" అని అన్నారు.