నాలుగు రోజులపాటు జరగనున్న టీఎస్ ఎంసెట్..!

SMTV Desk 2017-12-29 12:11:26  EMCET EXAM, TS STATE, ONLINE EXAMINATION, Chairman of Higher Education Council Papi Reddy

హైదరాబాద్, డిసెంబర్ 29 : తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షను ఇక నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా నాలుగు రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి.. తెలంగాణలో 2018-19 విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల(సెట్స్‌) తేదీలను వెల్లడించారు. ఏ సెట్ ఎప్పుడు, ఏ యూనివర్సిటీ నిర్వహించాలనేది నిర్ణయించారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌కు సుమారు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో.. ఆన్‌లైన్‌ విధానంలో భారీ సంఖ్యలో విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదు. కావున విడతల వారీగా ఈ పరీక్షను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందు కోసం రోజుకు 2 విడతలుగా మొత్తం 8 విడతల్లో ఎంసెట్‌ నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీని కోసం కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉన్న పలు ఇంజనీరింగ్‌, డిగ్రీ కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనున్నారు. ఇక మిగతా సెట్లను ఒకే రోజులో నిర్వహించనున్నారు. కాగా మొదటిసారి పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండడం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో జిల్లాల వారీగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాక్‌ టెస్టులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎంసెట్‌ పరీక్ష జరగనుంది.