తెలుగుదేశం పార్టీ జిల్లా విభాగాలకు కొత్త సారధులు

SMTV Desk 2017-06-18 19:03:26  Telugu Desham Party President Chandrababu,East Godavari ZP Chairman Rambabu

అమరావతి, జూన్ 18 : తెలుగుదేశం పార్టీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం.. శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌లను అధ్యక్షులుగా ప్రకటించారు. చిత్తూరు-వెంకటమణి ప్రసాద్‌, కడప-శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అనంతపురం-బీకే పార్థసారథి కొత్త అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే, విజయవాడ అర్బన్‌ టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులను భర్తీ చేయలేదు. ఇక, కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వకపోవడం గమనార్హం. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయని తెదేపా నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మిగతా జిల్లాల్లోనూ కొత్త అధ్యక్షుల నియామకంపై టీడీపీలో అసంతృప్తి వాతావరణం నెలకొంది. విశాఖ రూరల్‌ అధ్యక్షుడిగా పంచకర్ల రమేశ్‌బాబు పేరు ప్రకటించడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్థానికేతరుడికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని విశాఖ నేతలు పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చిన్నమనాయుడును జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. మండలస్థాయి నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని సీనియర్లు విమర్శించారని సమాచారం. చిత్తూరు జిల్లాలో పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి పరిమితమవడంతో జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తనను తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ కొనసాగించాలని నామన రాంబాబు కోరుతున్నారు.