మందు బాబులకు చేదు వార్త..!

SMTV Desk 2017-12-28 17:40:02  alcohol rates increase, telangana govt, excise department.

హైదరాబాద్, డిసెంబర్ 28 : మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచి మందు బాబులకు ముందే ఓ కిక్కిచ్చింది. తమకు ఇచ్చే ప్రాథమిక ధరను పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ప్రాథమిక ధరను పెంచాలంటూ సిఫారసు చేయడంతో ప్రభుత్వం మద్యం రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలను ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. ఏ బ్రాండ్ క్వార్టర్‌ను ఎంత ఎమ్మార్పీకి అమ్మాలనే విషయ౦పై ఒక స్పష్టతని ఇచ్చింది. కాని రూ.450లోపు ప్రాథమిక ధర ఉన్న శ్లాబులోని మద్యం రేట్లను మాత్రం పెంచలేదు. కేవలం రూ.450-700, రూ.700-1000, రూ.1000-2000, రూ.2000 పైన ఉన్న ప్రాథమిక ధరలను మాత్రం పెంచింది. దీంతో బుధవారం నుంచే మద్యం డిపోల నుంచి వైన్‌ షాపులకు కొత్త బేసిక్‌ ధరపై మద్యాన్ని సరఫరా చేశారు. ఇక రిటైల్‌ వ్యాపారులు ఈ ఉదయం నుండే కొత్త ఎమ్మార్పీ రేట్లకు మద్యాన్ని విక్రయించనున్నారు. అయితే కొందరు మద్యం షాపుల యజమానులు మాత్రం బుధవారం రాత్రి నుంచే కొత్త రేట్లను అమలు చేస్తున్నారు. ఈ పెంచిన మద్యం ధరలతో సర్కారుకు రూ.400 కోట్ల మేర అదనపు ఆదాయం రానున్నట్లు ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.