రైతులకు సాయం చేస్తానన్న రజనీకాంత్

SMTV Desk 2017-06-18 18:20:28  Tamilnadu CM Palani Swamy,Super star Rajinikanth,Farmers,South Indian Rivers Interlinking Farmers Association

చెన్నై, జూన్ 18 : తమిళనాడు రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్‌ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని చెబుతూ వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.