బీఫ్ కారణంగా నిలిచిపోయిన పెళ్లి

SMTV Desk 2017-06-18 16:55:53  Uttar Pradesh,CM Yogi Adityanath,Rampur

ఉత్తరప్రదేశ్, జూన్ 18 : సాధారణంగా వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు అనేక రకాల వంటలు చేయడం తప్పనిసరి. తాజాగా ఒక విందులో బీఫ్‌ పెట్టలేదని వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలుత చర్యతీసుకున్నది బీఫ్ పైనే... అక్రమ విక్రయశాలలు విపరీతంగా పుట్టుకొచ్చాయని చెబుతూ ఆయన బీఫ్ ను నిషేదించారు. అనంతరం కేంద్రం కూడా ముఖ్యమంత్రి చేసిన పనికి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాంపూర్‌ ప్రాంతానికి చెందిన యువతీ యువకులకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి రోజు వివాహానికి ముందు భోజనాలు చేసిన వరుడి కుటుంబ సభ్యులు విందులో బీఫ్ ఏదని? ప్రశ్నిస్తూ..కారు కట్నంగా కావాలని డిమాండ్ చేశారు. దీంతో వధువు తండ్రి యాదవ్‌ కారు తరువాత ఇస్తానని బీఫ్ మాత్రం పెట్టడం కుదరదని చెప్పాడు. రాష్ట్రంలో నిషేధం అమలవుతోందని, లేని పోని ఇబ్బందులు తలకెత్తుకోవడం ఇష్టం లేదని, బీఫ్ దొరకదని వారికి స్పష్టం చేశారు. అందువల్ల వివాహాన్ని రద్దు చేసుకుని వరుడి కుటుంబ సభ్యులు వెళ్లిపోవడంతో యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులతో కారు ఇప్పుడు కాకున్నా...వీలు చూసుకని తరువాత కొనిచ్చేవారమని, బీఫ్ తెమ్మంటే ఎక్కడి నుంచి తేగలమని ప్రశ్నించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తునట్లు సమాచారం.