కుబేర రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ

SMTV Desk 2017-05-29 10:41:47  telangana,telangana first in india,income, first in india

తెలంగాణ, మే 27 : ఆంధ్రప్రదేశ్ ధాన్యలక్ష్మిగా ప్రసిద్ది కెక్కితే... తెలంగాణా రాష్ట్రం ధనలక్ష్మిగా కాసుల వర్షం కురిపిస్తున్నది. సిరి గళగళలతో తెలంగాణా రాష్ట్రం ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఇందుకు సంబంధించిన ఆదాయాల్లో వృద్దిరేటు గణాంకాలు గురువారం విడుదలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో 17.82శాతం ఆదాయంలో వృద్దిరేటును సాధించడం తోపాటు పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో 17.81శాతం వృద్దిరేటును నమోదు చేసింది. వృద్ధిరేటు అనూహ్యంగా ఐదవవంతు కు చేరుకోవడం బట్టి ఆదాయంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నట్లు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కాగ్ నివేదికపై ప్రగతి భవన్ లో సమీక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదాయాభివృద్దిపై హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక ఆదాయవనరులు ఉన్న రాష్ట్రం అని ఉద్యమ సమయంలో తాము ప్రకటించినది అక్షర సత్యమనే విషయం తేటతెల్లం అవుతున్నదని చెప్పారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణాకు పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో విశేషమైన పురోగతి సాధించడం హర్షించదగ్గ విషయమని స్పష్టం చేశారు. ఆదాయాభివృద్ది రేటులో అనుకున్న ఫలితాలు వస్తున్న దరిమిలా సంక్షేమం, అభివృద్దిపై మరింత వ్యయం పెంచి రాష్ట్రాన్నిప్రగతి పథంలోకి తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. ప్రధాన పన్నుల్లో వచ్చే ఆదాయంలో వృద్దిరేటును పరిశీలిస్తే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణా 2015 ఆర్థిక సంవత్సరంలో 33 వేల కోట్ల పైచిలుకు, గత ఆర్థిక సంవత్సరంలో 39 వేల 183 కోట్లు సాధించి దేశంలోని అన్ని రాష్ట్రాలలో కన్న ప్రథమ స్థానంలో ఉంది. అదే విధంగా అన్ని పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలోను, వృద్ది రేటు అనూహ్యంగా పెరుగుతూనే వచ్చింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 36వేల 130 కోట్ల ఆదాయాన్ని, గత ఆర్థిక సంవత్సరంలో 42 వేల 564 కోట్ల ఆదాయాన్ని సాధించి పెరిగిన వృద్ది రేటుతో కుబేర రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణా తరువాత ధనిక రాష్ట్రాలుగా ప్రసిద్ది చెందిన ఝార్ఖాండ్, పశ్చిమ బెంగాల్ లు నిలిచాయి.