ఆర్కేనగర్‌ ఓటమిపై సమీక్షించనున్న అన్నాడీఎంకే నేతలు

SMTV Desk 2017-12-25 13:00:06  tamilanadu, aiadmk, ttv dhinakaran, dmk

చెన్నై, డిసెంబర్ 25 : తమిళనాడు రాజకీయాలలో ‘అమ్మ’ జయలలిత మరణం తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా నిన్న వెలువడ్డ ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో తమిళ ప్రజలు ఎవరు ఊహించలేని తీర్పునిచ్చారు. జయలలిత మరణం తర్వాత ఖాళీగా ఉన్న స్థానానికి ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలకు ఈ నెల 21 పోలింగ్జ జరుగగా, నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో శశికళ మేనల్లుడు, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌ 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఆర్కేనగర్‌లో ఓటమిపై సమీక్షించేందుకు అన్నాడీఎంకే అత్యున్నత కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ అన్నాడీఎంకే రెండోస్థానంతో సరిపెట్టుకోగా.. డీఎంకే డిపాజిట్ కోల్పోయింది. దీంతో అన్నాడీఎంకేలో అంతర్మథనం మొదలైంది. అంతే కాకుండా అమ్మ వారసుడిని తానేనని, మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని దినకరన్‌ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే పార్టీని కలవరపెడుతున్నాయి. నేడు జరిగే ఈ సమావేశంలో ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలతో పాటు దినకరన్‌ వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.