రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి అతిథి అతిథ్యం

SMTV Desk 2017-12-25 11:50:31  rajbhavan, president ramnath kovindh, Governor narasimhan

హైదరాబాద్, డిసెంబర్ 25 : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌరవార్థంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందు ఘనంగా సాగింది. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు ఆదివారం రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ విందు ఏర్పాటు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ విందుకు హాజరయ్యారైన సందర్భంగా వారిద్దరూ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆయన సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతిలకు ఘనస్వాగతం పలుకుతూ, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రులు ఇద్దరు ఒకచోట నిలుచుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, తెలుగు మహాసభల గురించి ప్రస్తావనకు వచ్చిందని, మహాసభలను బాగా నిర్వహించారని చంద్రబాబు కేసీఆర్‌ను అభినందించినట్లు సమాచారం. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల ఎన్నికల ఫలితాలపైనా ముఖ్యమంత్రులు విశ్లేషించారు. ఈ విందులో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రానా, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌,తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ విపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.