ఆదర్శమైన సందేశం ఇచ్చిన ట్రంప్

SMTV Desk 2017-06-18 13:43:39  America President Donald Trump,Fathersday,Discipline

వాషింగ్టన్, జూన్ 18 : నేడు ఫాదర్స్ డే ను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదర్శదాయకమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు విలువలు నేర్పే బాధ్యత, సామర్థ్యం తండ్రులదని...వారు నేర్పిన విలువలే మన జీవితాన్ని నడిపిస్తాయని అన్నారు. అంకితభావం, క్రమశిక్షణ, దేవుడిపై నమ్మకం వంటి లక్షణాలన్నీ పిల్లలు తండ్రుల నుంచే నేర్చుకుంటారని ఆయన చెప్పారు. దీంతో పిల్లల్లో నైతికత పెరిగి, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కారణమవుతుందని ఆయన చెప్పారు. పిల్లలు తండ్రి ప్రేమ, త్యాగాన్ని గుర్తిస్తే... వారి జీవితంలో తండ్రి పాత్ర ఎంత కీలకమైనదో అర్థమవుతుందని ఆయన అన్నారు. బాల్యంలో ఆటలాడినప్పుడు, చదువుకుంటున్నప్పుడు, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఇలా మనకు తెలియని ప్రతి విషయాన్ని నేర్చుకునే క్రమంలో పిల్లాడి పక్కన ఉండేది తండ్రేనని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రతి తండ్రి తన పిల్లలకే తొలి ప్రాధాన్యత ఇస్తారని, మిగిలిన విషయాలన్నీ తరువాతేనని చెప్పారు.. తన పిల్లల కోసం ప్రతి తండ్రి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటాడని అన్నారు. అలాంటి నాన్నకు ఫాదర్స్ డే రోజున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెబుదామని పిలుపునిచ్చారు.