భారీగా కొలువులు

SMTV Desk 2017-06-18 13:18:38  Telangana,CM KCR,Revenue division,Home minister Nayini Narsimha Reddy,Kadiyam Srihari,

హైదరాబాదు, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. శనివారం ప్రగతిభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని సమాచారం. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పోలీసు, రెవెన్యూ విభాగాల్లో 28,796 ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. జోనల్ విధానాన్ని రద్దు చేస్తూ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రెండంచెల విధానం మాత్రమే ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున రద్దుకు వీలుగా 371 డీ అధికరణ కు సవరణ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని తీర్మానించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురించి డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరులకు వివరించారు. పోలీసు వ్యవస్థను మరింత బలపరించేందుకు వివిధ విభాగాల్లో 26,290 ఉద్యోగ నియామకాలను కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 వేల పోస్టులతో పాటు18,290 కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానిస్టేబుల్ నుంచి ఎస్సై, సీఐ, డీఎస్పీల వరకు వివిధ హోదాల్లోని పోస్టులకు మూడు సంవత్సరాలలో దశలవారిగా నియామకాలు చేపడతామని కేబినేట్ తెలిపింది. రెవెన్యూ విభాగంలో 2,506 కొత్త పోస్టుల మంజూరుకు కేబినేట్ అనుమతినిచ్చింది. సీసీఎల్ ఎ కార్యాలయంలో 21 జూనియర్ అసిస్టెంట్లు, 8 డిప్యూటీ కలెక్టర్, 38 డిప్యూటీ తహసీల్దారు, 400 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, 700 వీఆర్వో , 1000 వీఆర్ఎ, 100 డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఆమోదం తెలిపినట్లు మంత్రుల బృందం తెలిపింది. శీఘ్రంగా పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు ముఖ్యమంత్రి ఆదేశించారు.