ప్రజాస్వామిక తెలంగాణకై నిరంతర పోరు: కోదండరా౦‌

SMTV Desk 2017-12-23 17:13:48  kodandaram, jac, political, democratic, comments, nalgonda

నల్గొండ, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక, వ్యాపార అనుకూల ప్రభుత్వం నడుస్తోందని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరా౦ విమర్శించారు. ప్రస్తుత పాలన రాచరికాన్ని తలపిస్తుందని, ప్రజాస్వామ్య పాలనను ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. దీనికై జేఏసీ ఆధ్యర్యంలో నిర౦తరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. క్షేత్ర స్థాయిలో పేద ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో కూర్చొని అధికారులు చెప్పిందే నిజమని నమ్ముతున్నారని కోదండరాం ఆరోపించారు. వాస్తవిక పరిస్థితులు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి పల్లెలకు పోయి పరిశీలించాలని ఆయన సూచించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని దీనిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. జేఏసీ ఆధ్యర్యంలో గ్రామాల్లో పర్యటించి రైతు సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.