సెల్‌ఫోన్‌ తగాదాలో ఓ విద్యార్ధి హత్య

SMTV Desk 2017-12-22 15:59:58  student death, cellphone, police, thamilanadu veluru

వేలూరు, డిసెంబర్ 22 : పగలూ ప్రతీకారాలు పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఒరవడినాయి. సెల్ ఫోన్ తగాదాలో ఓ విద్యార్ధి హత్యకు గురైన ఘటన త‌మిళ‌నాడులోని వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని వేపంతాంగళ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...పార్తీభన్‌ కుమారుడు సంతోష్‌(13) అనే బాలుడు పొయ్‌గైలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 20న పాఠశాలకు వెళ్లిన ఆ బాలుడు చీకటి పడినప్పటికీ ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతని కోసం గాలించని చోటులేదు. ఇంతలో పోలీసుల ద్వారా కొడుకు లేడన్నా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సెల్‌ఫోన్‌ కోసం జరిగిన తగాదాలో అతనిని హత్య చేసినట్లు లత్తేరి పోలీసులు సమాచారం తెలుసుకుని హత్యకు గురైన ప్రాంతానికి ఓ విద్యార్థిని తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు అడుకంపారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. విచారణలో సంతోష్‌ సహ విద్యార్థికి మధ్య సెల్‌ఫోన్‌ కారణంగా ఘర్షణ జరిగిందని, ఆగ్రహించిన ఆ విద్యార్థి సంతోష్‌పై దుడ్డుకర్రతో దాడిచేయడంతో తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తేలిందన్నారు. అంతేకాకుండా మృతదేహాన్ని రహదారి పక్కనున్న కాలువలో పడేసి ఆ విద్యార్ధి తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు స్థానిక విద్యార్ధులు పోలీసులు జరిపిన విచారణలో తెలిపారు. దీంతో సంతోష్‌ను హత్య చేసిన ఆ విద్యార్థిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు జువైనల్‌ హోంకు తరలించామని వెల్లడించారు. కాగా, పారిపోయిన మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు సాగుతున్నట్లు చెప్పారు.