పెళ్ళికి గంట ముందు బయటపడ్డ ఎన్ఆర్ఐ అల్లుడి బాగోతం

SMTV Desk 2017-06-17 17:32:06  Ongole,Malaysia,Singapore,Cheemakurthy

ఒంగోలు, జూన్ 17 : విదేశాల్లో ఉద్యోగం.. నెలకు మూడు లక్షల జీతం, మంచి సంబంధం...బిడ్డ సుఖపడుతుందనుకున్నారు. భారీ కట్నం, అధిక మొత్తంలో లాంఛనాలు..వధువు, వరుడి తరఫు వారు అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో ఖరీదైన కల్యాణ మండపంలో పెళ్లి. ఉదయం 11 గంటలకు ముహూర్తం. పెళ్లికి ఒక గంట ముందు ఎన్‌ఆర్‌ఐ అల్లుడి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్‌ నాలుగో లైన్‌లో నివాసం ఉంటున్న పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి మలేషియాలో ఉద్యోగం చేస్తున్నానంటూ చీమకుర్తికి చెందిన ఓ యువతితో వివాహం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లోని ఓ కళ్యాణ మండపంలో వివాహం. గురువారమే పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి సింగపూర్, మలేషియాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఐదుగురు వద్ద రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడంటూ ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో అదేరోజు సాయంత్రం వన్‌టౌన్‌ పోలీసులు కళ్యాణ్‌రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. అతని పాస్‌పోర్ట్, ఏఏ దేశాలు తిరిగింది అన్ని వివరాలు ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ ఎండ్లూరి రామారావు రాబట్టారు. మరో గంట లోపే పెళ్లి ఉందనగా శుక్రవారం ఈ సమాచారం పెళ్లి మండపంలోని పెళ్లి కుమార్తెకు, ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. వారికి వచ్చిన సమాచారం వాస్తవమేనని తెలుసుకొని ముందు ఇచ్చిన అడ్వాన్స్‌లు, లాంఛనాల సంగతి పక్కన పెట్టి ఆడపిల్ల భవిష్యత్తు ముఖ్యమనుకుని పీటల మీద పెళ్లిని అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. లక్షల రూపాయల డబ్బులిచ్చి మోసపోయిన బాధితుల పక్షాన వైఎస్సార్‌ సీపీ నాయకులు నిలిచి వారికి న్యాయం చేయాలని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారు.