బెజవాడలో మంట గలిసిన మానవత్వం...

SMTV Desk 2017-12-20 17:15:04  vijayawada, crime, andhrapradesh,

విజయవాడ, డిసెంబర్ 20: నగరంలో మానవత్వం మంట గలిసింది. అద్దె ఇంట్లో అనారోగ్యంతో కన్నుమూసిన మహిళా మృతదేహాన్ని లోనికి రానివ్వకుండా ఇంటి యజమాని కర్కశంగా వ్యవహరించారు. మానవత్వం మరిచిన అతడు ఇంటికి తాళం వేసి నడిరోడ్డుపైనే బంధించాడు. స్థానిక పెద్దలు పోలిసుల జోక్యంతో ఇంటికి తాళం తెరిపించిన కర్మకాండల కార్యక్రమాలు బయట చేసుకోవాలని షరతు పెట్టాడు. నాగమణి అనే మహిళ విజయవాడలోని విద్యాధరపురంలో నివసిస్తుండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదని, ఇంటికి తాళం వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పడంతో వాళ్లు జోక్యం చేసుకొని చివరకు తాళం ఇప్పించారు. కర్మకాండలు చేసేంత వరకు మృతురాలి కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వబోమని, వస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని వాదనకు దిగాడు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.