జయలలిత ఆసుపత్రిలో ఉన్న వీడియో బహిర్గతం..!

SMTV Desk 2017-12-20 13:00:50  jayalalita, dead vedio, vetrivel, release, tamilvadu

చెన్నై, డిసెంబర్ 20 : తమిళనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో వచ్చిన కీలక ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమ్మ జయలలిత చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్‌ వర్గానికి చెందిన పి.వెట్రివేల్‌ విడుదల చేశారు. ఇందులో అమ్మ ఆసుపత్రి బెడ్‌ మీద డ్రింక్‌ తాగుతూ కన్పించారు. దీనిపై వెట్రివేల్‌ మాట్లాడుతూ.. జయలలితను ఆసుపత్రిలో ఎవరూ కలవలేదనేది అవాస్తవమని చెప్పారు. ఆసుపత్రిలో అమ్మ చికిత్స పొందుతున్న వీడియో తమ వద్ద ఉందని, దానిని నేడు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ వీడియోను స్వయంగా శశికళే తీశారని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వద్ద కూడా ఉన్నాయని చెప్పారు. తమ వద్ద ఇంకా వీడియోలు ఉన్నాయని.. అవసరమున్నప్పుడు వాటిని విడుదల చేస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలితను గతేడాది సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 2016 డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను కలిసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆమె నెచ్చెలి శశికళ కుటుంబసభ్యులు మాత్రమే జయలలితతో ఉన్నారు. దీంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఇటీవల పన్నీర్‌ వర్గం నేతలు ఆరోపించారు. కాగా జయలలిత మృతిపై దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.