రాజనీతిజ్ఞుడు హెల్ముట్ కోల్ కన్నుమూత

SMTV Desk 2017-06-17 15:53:21  Europe,Helmut kol,Dwingpafen,Germany,Uro currency

బెర్లిన్, జూన్ 17 ‌: ఐరోపా రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు హెల్ముట్ కోల్. ప్రచ్ఛన్న యుద్ధంతో విడిపోయిన జర్మనీ పునరేకీకరణ పితామహుడుగా పేరొందిన ఆయన శుక్రవారం డ్వింగ్‌ఫఫెన్‌లోని తన ఇంట్లో మరణించారని జర్మనీ పత్రిక బిల్డ్‌ పేర్కొంది. హెల్ముట్‌ కోల్‌ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన మృతితో విచారంలో మునిగిపోయామని క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ పార్టీ ట్విటర్‌ ద్వారా తెలిపింది. బెర్లిన్‌ గోడ కూలిన తర్వాత ఐరోపా ఐక్యతకు కోల్‌ ఎంతగానో కృషి చేశారు. 1982 నుంచి 1998 వరకు ఛాన్సలర్‌గా పనిచేసిన ఆయన జర్మనీలో యూరో కరెన్సీని ప్రవేశపెట్టటం వెనక ముఖ్య పాత్ర పోషించారు. డచ్‌ మార్కును వదిలిపెట్టటానికి సంశయిస్తున్న జర్మన్లను ఒప్పించటంలో సఫలీకృతులయ్యారు. ఐరోపా దేశాల మధ్య స్నేహ సంబంధాలను నెలకొల్పటానికి అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రాంకోయిస్‌ మిటెరాండ్‌తో కలిసి సన్నిహితంగా పనిచేశారు. కోల్‌ 2008లో తూలి పడటంతో అప్పట్నుంచీ చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయన మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌, తదితరులు సంతాపం ప్రకటించారు.