సెంచరీ దిశగా టీఎస్‌పీఎస్సీ...

SMTV Desk 2017-12-19 15:26:52  tspsc, tELANGANA GOVERNMENT, JOBS NOTIFICATIONS, CHAIRMAN GANTA CHAKRAPANI.

హైదరాబాద్, డిసెంబర్ 19 : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఏర్పడి మూడేళ్లు కావస్తున్న సందర్భంగా 100వ నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 29,757 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. గత మూడేళ్ల నుండి 5932 పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని, 165 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పరిధిని పెంచిన ప్రభుత్వం.. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో నియామకాల బాధ్యతలను కమిషన్‌కు అప్పగించింది. గురుకుల టీచర్‌, పాఠశాల విద్యా టీచర్లు, వ్యవసాయం, వైద్య-ఆరోగ్య శాఖ, ఆర్టీసీలో ఖాళీల భర్తీని కూడా టీఎస్‌పీఎస్సీ చేపడుతోంది. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా 18.64 లక్షల మంది వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఘంటా వెల్లడించారు. త్వరలో పూర్తి స్థాయి సమాచారం నిమిత్తం హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కమిషన్‌ సభ్యుడు విఠల్‌ మాట్లాడుతూ.. దేశంలోనే నియామకాల్లో టీఎస్‌పీఎస్సీ అగ్ర స్థానంలో ఉందన్నారు. 2004-14 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా 23 జిల్లాల్లో భర్తీ అయిన ఉద్యోగాలు 25వేలేనని, టీఎస్‌పీఎస్సీ ద్వారా మూడేళ్లలోనే 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ 63 వేల పోస్టులకు క్లియరెన్స్‌ ఇవ్వగా.. 30 వేల పోస్టులు కమిషన్‌ ద్వారా భర్తీ అవుతున్నాయన్నారు.