భాజపాపై జాగ్రత్తగా స్పందించండి.. పార్టీ నేతలకు చంద్రబాబు సూచన

SMTV Desk 2017-12-19 12:41:10  chandrababu, warning, leaders, tdp, bjp, comments

అమరావతి, డిసెంబర్ 19 : పార్టీ అధికార ప్రతినిధులు తప్ప మిగతా నాయకులు అనుమతి లేకుండా మిత్రపక్షం భాజపాపై నోరు జారవద్దని నేతలను తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశించారు. భాజపా నేతలు తెలుగుదేశంపై విమర్శలు చేసినా.. వారి విజ్ఞతకే వదిలేయాలని ఆయన హితవు పలికారు. పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, భాజపా నేత సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర బంధం పాటించాలని.. అందులోనూ క్రమశిక్షణ కలిగిన తెదేపా శ్రేణులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే వూరుకునేది లేదని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సానుకూలంగా ఉండడంతో అనవసర విమర్శలు చేసి దూరం పెంచవద్దని నేతలకు ఆయన హితబోద చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి అనేక అవసరాలు ఉండడంతో పార్టీ నేతలు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ౦ సాధించడంతో ప్రధాని మోదీకి, అమిత్ షా కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.