ఆర్థిక ఇబ్బందులు.. అందుకే... వెళ్ళిపోతున్నాం...!

SMTV Desk 2017-12-18 14:51:38   Balapur Tana, Pahadisariph, Girls disappear, hyderabad

పహాడీషరీఫ్‌, డిసెంబర్ 18 : తల్లికి భారమవుతామని ఆలోచించిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్‌ కథనం ప్రకారం...షాహిన్‌నగర్‌ బిస్మిల్లాకాలనీలో ఉండే ఇంతియాజ్‌బేగం కూతురు సాదియాబేగం(17) పాతబస్తీ ఇంజన్‌బౌలి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి మృతి చెందడంతో ఇంట్లో తరచూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవి. కాగా, ఇంతియాజ్‌ బేగం చెల్లెలు ఇర్ఫాన్‌ఫాతిమాకు నూరీన్‌ ఫాతిమా(17) నస్రీన్‌ ఫాతిమా(16)లు కుమార్తెలు. వీరు ఇంజన్‌బౌలిలో ఉంటారు. శనివారం సాయంత్రం నూరీన్‌, నస్రీన్‌లు ఇంతియాజ్‌బేగం ఇంటికి సోదరి సాదియాను చూడడానికి వచ్చారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున ఇంతియాజ్‌ లేచిచూడగా ముగ్గురూ కనిపించకుండా పోయారు. ఇంట్లో బాలికలు రాసిన లేఖను తీసుకుని ఇంతియాజ్‌బేగం బాలాపూర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని, తాము మీకు భారమవుతామని, మేమే ఎక్కడికైనా వెళ్లి పెళ్లిచేసుకుంటాం... లేదా ఆత్మహత్య చేసుకుంటామని ఆ లేఖలో రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. ఇంతియాజ్‌బేగం, తన సోదరితో కలిసి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.