ఫలితం లేక తప్పు దారి ఎంచుకున్న విద్యార్ధి

SMTV Desk 2017-12-16 16:20:40  IPS, civils, student Fraud, kadapa dist

గిద్దలూరు, డిసెంబరు 16 : కడప జిల్లా కాశినాయన మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన గిద్దలూరులో డిగ్రీ చదివే కర్నాటి గురువినోద్‌కుమార్‌ రెడ్డిపోలీసు అధికారిగా ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. దీని కోసం హైదరాబాద్‌, ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుని సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇతడి స్నేహితులు కొందరు మాత్రం సివిల్స్‌ లో ఎంపికయ్యారు. దీంతో తాను కూడా వారితో సమానంగా గౌరవం పొందాలనే కోరికతో తప్పుడు దారి ఎంచుకున్నాడు. ఐపీఎస్ గా సెలెక్ట్‌ అయ్యాయని, ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీకి శిక్షణకు వెళ్లాలని అందరికి తెలిపాడు. నమ్మించడానికి తనకున్న సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానంతో నకిలీ ఉత్తర్వులు సృష్టించాడు. ఇటీవల ఒక కేసు నిమిత్తం గిద్దలూరు వచ్చిన వినోద్‌, ఎస్‌ఐ మల్లికార్జునను కలిశాడు. మాటల సందర్భంలో తాను ఐపీఎస్ గా సెలక్ట్‌ అయ్యాయని, తనవారికి ఫేవర్‌ చేయాలని కోరాడు. 2016 బ్యాచ్‌లో ర్యాంక్‌ పొందానని వినోద్‌ చెప్పడంతో, అనుమానం వచ్చిన ఎస్‌ఐ వెంటనే సీఐకి సమాచారం అందించారు. గత రెండేళ్లలో సివిల్స్‌లో ఉత్తీర్ణులై, ఐపీఎస్ కు ఎంపికైనవారి జాబితాను వీరు పరిశీలించగా ఎక్కడా వినోద్‌ పేరు కనిపించలేదు. దీంతో శుక్రవారం వినోద్‌ను పోలీసులు అరెస్టు చేసి, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.