తొలిసారి తెలుగులో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్!

SMTV Desk 2017-12-16 16:04:51  asaduddin owaisi, telugu speech, first time, world telugu conferences

హైదరాబాద్, డిసెంబర్ 16: ఇప్పటివరకు ఏ వేదికపై కూడా తెలుగులో మాట్లాడని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సంఘటన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ ఉపన్యాసాలలో జరిగింది. సభకు విచ్చేసిన ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్కారములు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు అంటూ ఆద్యంతం తెలుగులోనే ఆయన మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషదాయకమని, తెలుగు భాషాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని ఓవైసీ ప్రశంసించారు. కుతుబ్‌షాహీ కాలంనుంచి హిందూముస్లింలు ఐకమత్యంతో జీవిస్తూ పాలు నీళ్లలా కలిసిపోయారని ఓవైసీ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని, ఇండస్ట్రియల్, ఐటీ, ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. పాతనగరంలో నివాసం ఉంటున్న షరీఫ్ ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడని, గఫూర్ అనే రచయిత తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించి తెలుగు భాష సేవచేశాడని ఓవైసీ పేర్కొన్నారు. పాతబస్తీలోనూ తెలుగు సేవకులు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.