చౌక దుకాణాలలోనే నిత్యవసరాల విక్రయం

SMTV Desk 2017-05-28 19:15:11  ration shop,all goods,chandrababu,

ఆంధ్రప్రదేశ్, మే 27 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని చౌక దుకాణాల్లో ఇక నుంచి ఇతర నిత్యావసరాలను కూడా విక్రయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఇప్పటికే కొన్ని రేషన్‌ షాపుల్లో కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పామాయిల్‌, ఉప్పు తదితర నిత్యావసరాలను విక్రయిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని అన్ని షాపుల్లో అమలుచేస్తే రూ.100 కోట్ల అదనపు భారం పడుతుందని గురువారం కలెక్టర్ల సదస్సులో అధికారులు సీఎంకు తెలిపారు. భారం పడినా ప్రజలకు రాయితీతో ఈ నిత్యావసరాలను అందజేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 15 నుంచి 20శాతం రాయితీతో ఈ నిత్యావసరాలను రేషన్‌ కార్డులు ఉన్నవారికి అందజేస్తారు. రేషన్‌ షాపుల్లో సరుకుల కొనుగోలుకు నగదు రహితం తప్పనిసరి కాదని సీఎం స్పష్టంచేశారు. నగదురహిత లావాదేవీల వల్ల అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి పితాని సత్యనారాయణ ప్రస్తావించగా.. ఈ మేరకు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ మొదటి వారానికల్లా రాష్ట్రంలో దీపం పథకం కింద నూరుశాతం వంటగ్యాస్‌ కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో దీపం కనెక్షన్ల మేళా నిర్వహించి ఒకేరోజు 10వేల కనెక్షన్లు జారీచేసిన అధికారులను అభినందించారు.