త్వరలో మళ్లీ అగ్రిగోల్డ్ లెక్కలు

SMTV Desk 2017-12-15 15:22:41  agree gold, ap amaravathi, CID

అమరావతి, డిసెంబర్ 15 : ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితుల లెక్కల విషయంలో సీఐడీ అయోమయం పరిస్థితిలో ఉంది. దేశంలోని 8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు ఉన్నారు. అయితే, బాధితులకు న్యాయం చేసేందుకు ఏడాదిన్నర క్రితమే ప్రత్యేక వెబ్‌సైట్‌ https://protectionofapdepos-itors.com ఏర్పాటు చేసింది. దీనికి తమ వివరాలు నమోదు చేయాలని సూచించగా... నవ్యాంధ్ర నుంచి 9.98 లక్షల మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సీఐడీ దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం ఏపీలోని 13 జిల్లాల్లో 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. బాధితులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో, సీఐడీ అక్టోబరు 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 715 బాండ్ల పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేసింది. సుమారు 50 రోజులకు పైగా జరిగిన ఈ పరిశీలనలో బాండ్లతోపాటు, నగదు జమ చేసిన రశీదు, బ్యాంకు పాసు బుక్‌, ఆధార్‌ సంఖ్యను పరిశీలించారు. ఈ కేంద్రాల్లో మొత్తం 21.66 లక్షల మంది డిపాజిటర్లు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అంటే, సీఐడీ దర్యాప్తులో తేలిన సంఖ్య కంటే ఇది 2.14 లక్షలు అదనంగా రావడంతో తమ దర్యాప్తులో తేలినదానికంటే.. ఎక్కువసంఖ్యలో బాధితులు నమోదు చేసుకోవడంపై దృష్టి సారించామని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీనిపై తమ టెక్నికల్‌ టీమ్‌ కసరత్తు చేస్తోందని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కొన్ని కేంద్రాలను తెరవబోతున్నట్లు సమాచారం. సుమారు ఆరు జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున మరిన్ని రోజులు తెరవాలని డిపాజిటర్ల నుంచి సీఐడీకి వినతులు తెలియజేస్తున్నారు.