ప్రస్తుత పదవీకాల౦ భార్య లేని జీవితం వంటిది: వెంకయ్య నాయుడు

SMTV Desk 2017-12-15 14:30:08  venkaiah naidu, vice president, comments, wife, life, friends, public

న్యూ డిల్లీ, డిసెంబర్ 15: ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న తెలుగు తేజం, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అయిష్టంగానే పార్టీ నిర్ణయం మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండవలసి రావడం, ప్రజలను కలిసే అవకాశం తక్కువగా ఉండడంతో ఆయన విముఖత చూపినట్లు అప్పట్లో వివరించారు. తాజాగా తన అయిష్టతను, ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఒక పత్రిక డిల్లీ సంచికను ఆవిష్కరించిన సందర్భంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు దూరం అవడం భార్య లేని జీవితంతో సమాన౦. ఉప రాష్ట్రపతి కాకముందు రాజకీయ నేతగా ప్రజలతో కలిసి పోయేవాడినని, కాని ఇప్పుడు తనకు అంత స్వేచ్ఛ లేదని ఆయన అన్నారు. అధికారిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు ప్రోటోకాల్ కారణంగా, స్నేహితులను, అభిమానులను కలుసుకునే అవకాశం తగ్గిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైకి వచ్చి, రాసిచ్చిన నాలుగు మాటలు మాట్లాడాలి.. నమస్తే చెప్పి పోవాలి...ప్రజలతో కలవకుండా, మాట్లాడకుండా ఈ జీవితంలో ఇంకేముంది అని వెంకయ్య నిర్వేదం వ్యక్తం చేశారు. ఏమి చేయాలో తెలియడం లేదని, క్రమంగా అలవాటు పడుతున్నానని ఆయన పేర్కొన్నారు.