ఏడాదిలోగా గమ్యానికి చేరనున్న పోలవరం ప్రాజెక్ట్ :బొండా

SMTV Desk 2017-12-15 12:03:08  ap polavaram project, Central MLA Bonda Umamaheswara Rao

విజయవాడ, డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి అవుతుందని సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్‌ పై ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలకు చెక్‌ పడే సమయం వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ భవిష్యత్తు ప్రమాదమని గ్రహించిన ప్రతిపక్షాలు, ఈ నిర్మాణం పూర్తి కాకూడదని అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించి ఆపే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులను రెచ్చ గొట్టడంతో పాటు ట్రిబ్యునల్స్‌, న్యాయస్థానాల ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. 2013లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటికి ఆర్‌ఆర్‌ ప్యాకేజిని ప్రకటించకపోవడంతో నేడు అదనపు భారం అయిందన్నారు. శాసనసభ సమావేశాలలో రోజు మొత్తం పోలవరం ప్రాజెక్ట్‌పైనే చర్చించడంతో పాటు ముఖ్యమంత్రి ప్రతీ సోమవారం పోలవరంపై చర్చలు జరుపుతూ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 40 పర్యాయాలు ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారన్నారు. ఈ మేరకు కేంద్రం ఆర్‌ఆర్‌ ప్యాకేజిని ప్రకటించడం శుభపరిణామమన్నారు.