వాగ్దానం నిలబెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే

SMTV Desk 2017-06-16 18:43:28  A bracelet auction, Former MLA and Congress leader East Jayaprakash Reddy,V. VHR, rahulgandhi

హైదరాబాద్, జూన్ 16 : తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు తనకు ప్రేమగా బహుకరించిన బంగారపు బ్రాస్‌లెట్‌ను వేలం వేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం ఈ వేలంపాట నిర్వహించడంతో కృషి బిల్డర్స్‌కు చెందిన మహేందర్‌ రెడ్డి రూ. 20 లక్షలకు దీన్ని సొంతం చేసుకున్నారు. వేలం ద్వారా వచ్చిన 20 లక్షల రూపాయలను ఖమ్మంలో అరెస్ట్‌ అయిన 11 మంది మిర్చి రైతులకు తలా ఓ లక్ష, వరంగల్‌ జిల్లా రైతులకు మరో రూ. 9 లక్షలు ఇయ్యానున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. సంగారెడ్డిలో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ విజయవంతంగా భారీ బహిరంగ సభ నిర్వహించింది. జగ్గారెడ్డి తన సొంత ఖర్చుతో ఈ సభ ఏర్పాటు చేశారని రాహుల్‌ గాంధీతో హనుమంతరావు చెప్పారు. మరి మేరేమీ ఇవ్వలేదా అని ఆయనను రాహుల్‌ ప్రశ్నించారు. ఇవ్వడానికి తనదగ్గర ఏముందని వీహెచ్‌ సమాధానమివ్వగా.. ఆయన చేతికున్న బ్రాస్‌లెట్‌ను చూపించి ఇది ఇవ్వొచ్చు కదా అని రాహుల్‌ అన్నారు. తర్వాత వీహెచ్‌ తన చేతికున్న బ్రాస్‌లెట్‌ను జగ్గారెడ్డికి బహుకరించారు. దీన్ని వేలం​పాట వేసి వచ్చిన మొత్తాన్ని రైతులకు ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన ఈ బ్రాస్‌లెట్‌ను వేలం వేశారు. ఆ వచ్చిన మొత్తాన్ని రైతులకు అందచేశారు.