బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇలా చేయండి

SMTV Desk 2017-06-16 16:19:38  Experts,Hormones, Dietary fat, Dryfruce, Ricebron,Proteins, pea, Carbohydrates

హైదరాబాద్, జూన్ 16 : వాస్తవానికి సన్నబడడం కోసం ఇంట్లో పదార్థాలకి బదులు బయటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వలన ఈ మధ్య కాలంలో చాలావరకు అధిక బరువు, లావుగా అవుతున్నారు. వారిలో సన్నబడాలనుకునే వారు కొందరు అన్నం మానేసి ఏవో ఒకటి తినేస్తుంటారు. మరికొందరేమో పూర్తిగా పొట్ట మాడ్చేస్తుంటారు. వాస్తవానికి ఈ రెండు పద్ధతులూ సరికదంటున్నారు నిపుణులు. మరెలా అంటారా..బరువు తగ్గేందుకూ ఓ ఉపాయం ఉంది. సమయం లేదనో, వండుకోవడం రాకనో తరచూ బయటి ఆహారంపై ఆధారపడుతున్నారా? అందులో అన్నానికి బదులు ఇతర పదార్థాలు ఎంచుకుంటున్నారా.. అయితే మీరు సులువుగా బరువు పెరిగిపోతారు సుమా! అలా బయట తినే సందర్భాన్ని వీలైనంతవరకూ తగ్గించుకోండి. ఒకవేళ తినాల్సి వచ్చినా..ఏవి పడితే అవి కాకుండా మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి ఎంచుకోవడం మంచిది. తరచూ ప్రయాణాలు చేసేవారు. ఆఫీసులకు వెళ్లేవారు ఈ సూచనను తప్పనిసరిగా పాటించగలిగితే మంచిది. సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదనుకుంటారు. ఇది పొరబాటు. శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్‌ కూడా కొంతవరకూ అవసరమే అంటారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్‌ నూనె.. వంటివి ఎంచుకోవాలి. శరీరానికి తగినంత శక్తి అందనప్పుడు ఆకలి నియంత్రణలో ఉండదు. దాంతో ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే..పొద్దున్నే అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివీ మీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవాలి. బరువు పెరగడానికి ప్రధాన కారణం.. మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంక్లిష్ట పిండిపదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. ఈ విధంగా రోజువారి ఆహర పద్ధతులను క్రమం తప్పకుండా చేయటం ద్వారా సన్నబడడంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటారు.