ఏప్రిల్‌ లేదా మే లో పంచాయతీ ఎన్నికలు..?

SMTV Desk 2017-12-12 15:25:27  panchayat elections, state election commition, circular, telangana

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తిచేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతు౦ది. ఈ మేరకు ఎన్నికలను ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించి సంబంధిత కసరత్తు కూడా ప్రారంభించింది. తాజాగా జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో గెలిచిన సర్పంచుల పదవీకాలం 2018 వచ్చే ఏడాది ఆగస్టు 1తో ముగియనుండగా ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జూన్, జూలైలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. రైతులు ఖరీఫ్‌ పనులలో తలమునకలుగా ఉంటారు. కాబట్టి ఏప్రిల్‌ లేదా మే లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని, అప్పటికి విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి 243 ఇ(3ఎ) అధికరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే వీలుంది. సెక్షన్‌ 13(2) ప్రకారం గడువుకు 3 నెలలు ముందే ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఈ మేరకు గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంఘం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు పలు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 8,684 పంచాయతీలుండగా, మరో 4 వేల పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశముంది. ముఖ్యంగా తండాలను పంచాయతీలుగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. అయితే పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవలే పేర్కొ౦ది.