అక్రమ రిజిస్ట్రేషన్ల పై కొరడా

SMTV Desk 2017-06-16 15:02:40   Miyapur, Land Registrations, Hyderabad,

హైదరాబాద్, జూన్ 16 : మియాపూర్ భూబాగోతల నేపథ్యంలో ఇతరుల పేరిట అక్రమంగా జరిగే సర్కారు భూముల రిజిస్ట్రేషన్లు తప్పుడు పద్ధతుల్లో ఇకపై చెల్లవు. భూముల రిజిస్ట్రేషన్లు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ బయటకు తీసి, అక్రమాలని తేలితే రద్దు చేయాలనితెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృఢ నిర్ణయంతో ఉన్నది. తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు జరిగినా అవి జరుగనట్లేనని రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 41 స్పష్టం చేస్తున్నది. ఈ చట్టం అమలు కోసం రూపొందించిన రూల్స్‌లోని 243వ నిబంధన ప్రకారం.. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయవచ్చు. దేవాదాయ శాఖకు చెందిన భూములైతే ఆ శాఖ రద్దు చేస్తారు. వక్ఫ్‌బోర్డు భూములైతే వక్ఫ్ బోర్డు సీఈవో రద్దు చేస్తారు. ఇలా ప్రభుత్వ భూములు, ఇతర సంస్థల భూములను కాపాడటానికి చట్టమే అవకాశం ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. కొంతమంది రిజిస్ట్రార్లు ప్రలోభాలకు లొంగి చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని అంటారని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నదంటున్నారు. భూముల ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూమాఫియా జడలు విప్పడంతో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. అటువంటి భూములు చేతులు మారడంతో ఇప్పటికే బహుళ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాస్తవాలు విచారించక, అక్రమమని తెలిసినా అవినీతికి పాల్పడి కొందరు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర కూడాఉంటున్నది. మియాపూర్ భూబాగోతం ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్లు భూములను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు విధిగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని అంటున్నారు.