రెండు నెలల తర్వాత మన్యంలో పట్టాలెక్కిన రైలు...

SMTV Desk 2017-12-12 11:42:19  train, restart, borra-chimidipalli, vishakhapatnam updates

అరకు, డిసెంబర్ 12: సరిగ్గా 66రోజుల క్రితం ఈ ఏడాది అక్టోబరు 6న కేకే లైనులో బొర్రా - చిమిడిపల్లి స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడి కుప్పవలస వంతెనపై పడటంతో పిల్లరు దెబ్బతింది. దీంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన రైల్వే ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన పిల్లరు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నెల 8న ట్రయల్‌రన్‌ విజయవంతంగా నిర్వహించి 9, 10 తేదీల్లో విద్యుత్తు సంబంధ పనులను పూర్తి చేసిన రైల్వే అధికారులు సోమవారం నుంచి రాకపోకలకు పచ్చజెండా ఊపారు. జగదల్‌పూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలి కూత పెట్టగా, సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మన్యం సందర్శనకు వచ్చే పర్యాటకులతో విశాఖపట్నం - కిరండూల్‌ పాసింజరు రైలు కుప్పవలస వంతెన మీదుగా 10.30 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంది. రెండు నెలల విరామం తర్వాత పర్యటక రైలు పునఃప్రారంభం కావడంతో పర్యటకులు ఆనందం వ్యక్తం చేశారు.