కేంద్రం అంగీకరిస్తే పాక్ తో క్రికెట్ : బీసీసీఐ

SMTV Desk 2017-12-11 20:59:27  BCCI, FTP MEETING, ALL FORMAT SCHEDULE, BCCI SECRATRARY AMITAB CHOWDARY

న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : విశ్రాంతి లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, బిజీ షెడ్యూల్‌పై ఆలోచించాలని ఇటీవల టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి, అమితాబ్‌ చౌదరి మీడియాతో మాట్లాడుతూ..." కొత్త ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)లో భాగంగా 2019-2023 మధ్య అన్ని ఫార్మాట్లలో భారత్‌ 81 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. అంతే కాకుండా ప్రస్తుత ఎఫ్‌టీపీతో పోలిస్తే 30 మ్యాచ్‌లు ఎక్కువ ఆడాల్సిన రోజులు పెరుగుతున్నప్పటికీ ఆటగాళ్లపై పనిభారం తగ్గిస్తాం. అఫ్ఘనిస్తాన్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 2019లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉందని, కానీ భారత్‌-అఫ్ఘనిస్తాన్‌ చారిత్రాత్మక సంబంధాల నేపథ్యం దృష్ట్యా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ భారత్‌తో ఆడే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం అనుమతిస్తే దాయాది దేశం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు చోటు కల్పిస్తా౦." అని అమితాబ్‌ చౌదరీ వెల్లడించారు. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘానికి (ఆర్‌సీఏ) దూరంగా ఉంటానని చెప్పడంతో ఆ సంఘంపై నిషేధాన్ని బీసీసీఐ తొలిగించింది.