ఏపీ సిద్దంగా ఉంటే మేము చొరవ తీసుకుంటాం - కేంద్రమంత్రి

SMTV Desk 2017-06-16 13:33:03  Indian Goverment,Ministry of Justice,High court,Ravishankerprasad

న్యూ ఢిల్లీ, జూన్ 16 : కేంద్రప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో న్యాయ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి హైకోర్టు విభజనపై పాత్రికేయులు ప్రశ్నించగా కేంద్రమంత్రి మాట్లాడుతూ "హైకోర్టును విభజించడం సమస్య కాదని, ఏపీ హైకోర్టుకు కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే చొరవ తీసుకుంటామని తెలిపారు." అంతేకాకుండా న్యాయమూర్తులు, న్యాయస్థానాల సిబ్బందికి నివాస సముదాయాలను ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండడం తప్పనిసరని, దీని వల్ల కేసుల విచారణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయని రవిశంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుండి ఈ అంశంపై హైకోర్టులో విచారణ జాప్యంలో ఉండడం, స్టే ఉత్తర్వుల వల్ల అవాంతరాలు ఏర్పడ్డాయని చెప్పారు. రెండు రాష్ట్రాల సమస్యల పరిస్కారంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తుందని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. కేసుల విచారణను శీఘ్రంగా పూర్తి చేసేలా, పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అన్ని కోర్టుల న్యాయమూర్తులకు ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు.