వచ్చే ఖరీఫ్‌కు అన్ని శాఖలు సన్నద్ధం కావాలి: చంద్రబాబు

SMTV Desk 2017-12-11 12:28:59  chandrababu, tele conference, agriculture, amaravati

అమరావతి, డిసెంబర్ 11: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నీరు-ప్రగతి, వ్యవసాయం-పురోగతిపై ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొనగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ మూడు వారాలు ముందుగా వచ్చింది కాబట్టి రబీ కూడా మూడు వారాలు ముందుగానే ముగించాలని, తద్వారా ఆదా అయ్యే నీటిని వచ్చే ఏడాది ఖరీఫ్‌ అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే ఖరీఫ్‌ సేద్యానికి ఇప్పటినుంచే అన్ని శాఖలు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ముందస్తు నాట్ల వల్ల రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించగలిగామని, మైక్రో న్యూట్రియంట్స్‌ ఉచితంగా అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని సీఎం అన్నారు. నకిలీ విత్తనాల తయారీదారులతో పాటు వాటిని విక్రయించే వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో హెల్దీ సాయిల్‌ తయారుకావాలని, హెల్దీ క్రాప్‌ రావాలని, ఇదే మన లక్ష్యమని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.